కడలి న్యూస్, విశాఖపట్నం:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కొత్త వైస్-చాన్సలర్‌ను నియమించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్న ప్రొఫెసర్ జి.పీ. రాజశేఖర్ ని ఈ పదవికి నియమిస్తూ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం, 1991 ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం గెజిట్‌లో ఫిబ్రవరి 18, 2025న ప్రకటించబడింది. ఈ నియామకం మూడు సంవత్సరాల కాలానికి ఉండనుంది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి శ్రీ కోనా సశిధర్ విడుదల చేశారు. సంబంధిత విద్యా సంస్థలు, యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తదితర సంస్థలకు సమాచారం పంపించారు. విద్యా రంగంలో అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ రాజశేఖర్ గారి నియామకం విశ్వవిద్యాలయానికి ప్రయోజనకరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త వైస్-చాన్సలర్ తన బాధ్యతలు స్వీకరించనున్నారు.