జూలై 7నుంచి జగన్నాథుని రథయాత్ర



కడలి న్యూస్, విశాఖపట్నం:-
 
 జగన్నాథుని రథయాత్ర  ఒడిశాలోని పూరీలో జరిగే ప్రధాన హిందూ పండుగ.   ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర  జూలై 7తేదీ  ఆదివారం నుంచి ప్రారంభమై జూలై 16వ తేదీన ముగుస్తుంది.  ఈ పవిత్రమైన యాత్రలో జగన్నాథుడు, బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు.   ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ తీర్థయాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. 

పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుని రథయాత్ర 12వ శతాబ్దంలో ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతున్నారు. పూరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా జగన్నాథ ఆలయాలు ఉన్న ప్రతీ చోటా భక్తులు రథయాత్ర నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఒడిశాలోని గజపతి జిల్లా పర్లాకిమిడి, జీరంగి,  గండాహాతి, నారాయణపూర్, గురండి, అంకుడు గ్రామాల్లో కూడా నిర్వహిస్తారు. ఈ యాత్రలో పాల్గొంటే ఎంతో పుణ్య ఫలాలు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. ఇలాంటి రథయాత్రను విశాఖలోని కొత్త రోడ్ లో గల జగన్నాధ్ ఆలయం, సిరిపురంలోని ఒరియా సాంస్కృతిక సమ్మేళనం, స్టీల్ ప్లాంట్ లోని జగన్నాథ ఆలయాలతో పాటు ఇస్కాన్, హరే కృష్ణ మూమెంట్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రథయాత్ర నిర్వహిస్తారు.   ఆషాఢ మాసంలో (జూన్-జూలై) లో జరిగే ఈ  యాత్రలో మూడు రథాలు - పసుపు, ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు రంగుల ముదురు రంగు పందిరితో అలంకరించబడి- మూడు అంతస్తుల ఎత్తులో రథాలు ఉంటాయి. ఒక రథంపై జగన్నాథుడు నలుపు రంగులో దర్శనమిస్తాడు. భక్తులు "విశ్వానికి ప్రభువు" అని పిలుస్తారు. మరొకదానిపై జగన్నాథ సోదరుడు బలదేవుడు తెల్లటి మేఘ వర్ణంలో దర్శనమిస్తాడు.  మూడవది వారి సోదరి,  సుభద్ర పసుపు రంగులో దర్శనమిస్తారు. ముగ్గురికీ పెద్ద గుండ్రటి కళ్లు, విశాలమైన చిరునవ్వు, చేతులు కాళ్లు సగం మాత్రమే పూర్ణితమై ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గజపతి జిల్లా జిరంగి లో మాత్రం దేవేరులు చేతులలో శంకు చక్ర గదా ధరించి అభయం ఇస్తున్నట్లు దర్శనమిస్తారు. పర్లాకిమిడి నుంచి 33 కిలోమీటర్లు దూరంలో ఉన్న జీరంగిలో జరిగే రథయాత్రలో ఎక్కువుగా తెలుగువారు పాల్గొంటారు.  అవకాశం ఉంటే ఈ ఆదివారం  కన్నుల పండువుగా జరిగే రథయాత్రలో మీరూ పాల్గొని విశ్వ దేవుడిగా గుర్తుంపు పొందిన ఆ జగన్నాధుని ఆశీస్సులు పొందండి...



కామెంట్‌లు